Dear ALL,
Adding this post written by Manasa on our group, at
http://www.madhumanasam.blogspot.com/.
'ప్రతి రోజూ మా ఉదయం పేపర్ చదవడంతోనే మొదలవుతుంది' అని గర్వం గా చెప్పుకునే వాళ్ళు ఈ దేశంలో లక్షల మంది ఉంటారు. అదే నిజమైతే..వాళ్ళ ఉదయం ఎలా మొదలవుతోంది ?
ఏనాడూ కలిసి లేని మనం , మళ్లీ మళ్లీ విడిపోవాలని ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటుంటే, ఆ వైకుంఠ పాణి ఆడలేని అమాయక ప్రాణాలు ఎలా వైకుంఠానికి పోతున్నాయో బొమ్మలలో చూడడంతోనా?
నిజాలు జనాలను చేరకుండా ఆపేందుకు ఒకరిని మించి ఒకరు ఎలా పోటీలు పడుతున్నారో చూసి నవ్వుకోవడంతోనా?
మంచిని మరిచిన కొందరు మానవ మృగాలు ఆటవిక యుగపు దాఖలాలు మన చుట్టూరా ఇంకా మిగిలే ఉన్నాయని సాక్ష్యం ఇస్తుంటే , అరాచకాన్ని ఖండించలేని పిరికితనంతో వార్తలను చదివి బాధ్యత తీరిపోయింది అనిపించుకోవడంతోనా?
పదేళ్ళ పసి పిల్లాడు అప్పుడప్పుడూ అమ్మా నాన్నలిచ్చే రూపాయి రూపాయి కూడబెట్టుకుని , బళ్ళో వరద బాధితులకి విరాళాలు అడగగానే , ఆ డబ్బంతా ఆనందంగా అప్పజెపితే, అలాంటి డబ్బులను కూడా నిస్సిగ్గుగా సొంత ఖాతాలోకి చేర్చుకున్న మహా మహుల చరిత్రలు చదవడంతోనా?
ఈ దేశం అవినీతికి చిరునామా అని అడగకపోయినా అందరికీ పేరు పేరునా చెప్పి, అన్యాయం వేళ్ళూనుకు పోయిన ఈ సమాజాన్ని ఎన్ని తరాలు మారినా మార్చలేమని మనని మనం ఎమార్చుకోవడం తప్ప ఎప్పుడైనా ఏమైనా చెయ్యాలని ప్రయత్నించామా?
మన ఇంటి ముందు మాన్ హోల్ లో పసి మొగ్గ పడిపోతే, రేపొద్దున వార్తల్లో ఏం రాస్తాడో అని ఎదురు చూస్తాం. ఇండియన్ క్రికెట్ టీం వైఫల్యానికి అర్ధ రాత్రి పార్టీలే కారణమని టీవీ లు అరగంట హోరెత్తిస్తే, తెల్లవారగానే ముందు ఈ విషయం మొత్తం చదవాలని నిర్ణయించుకుని పడుకుంటాం.
ప్రతి చోటా , ప్రతి పనికీ లంచాలు ఇవ్వందే పని జరగడం లేదని వాపోతాం. ఇంకో పది మందికి చెబుతాం. ఎప్పుడైనా ఎవరో ఒక నిజాయితీ కలిగిన రిపోర్టర్ వీళ్ళందరి మీదా ఏమైనా రాసినప్పుడు, నిబద్దత కలిగిన పోలీసులు వెను వెంటనే తగిన చర్యలు తీసుకున్నప్పుడు, మనం చెయ్యలేని పని వేరెవరో చేసినందుకు చప్పట్లు కొడతాం. సంబరాలు చేసుకుంటాం.
ఇక ఇంతేనా? మన జీవితం ఎన్నాళ్ళయినా ఇంతేనా? రావణుడిని చంపడానికి రాముడి రాక కై ఎదురు చూసాం. నరకాసురుడిని అంతమొందించేందుకు మరో అవతారం కావలన్నాం. బ్రిటిష్ వాళ్ళ ఉక్కు పాదం కింద నలిగిపోతూ మహాత్ముడెవడో వస్తాడని నిరీక్షించాం .
ఇక చాలు. మహాత్ముడు తన సైన్యం తో మనకి స్వాతంత్ర్యం సాధించి పెడితే, అది మనకి మరో అస్త్రం ప్రసాదించింది.
రాముడి కోసం, కృష్ణుడి కోసం ఈ సారి ఎన్ని యుగాలు ఆగాలో మనకీ తెలీదు.ఒక వేళ మనం అంతా ఓపిగ్గా ఆగినా, సాక్షాత్తూ ఏడు కొండల మీదే మోసాల ముసుగు కప్పిన ఘనుల మీద అలిగి ఇటు వైపు చూడబోనని స్వామి వారు ఈ పాటికే శ్రీదేవి కి మాటిచ్చి ఉండరూ ? పోనీ , మహా లక్ష్మి దయ కలిగినదై ఒక్కసారి వాళ్ళని కరుణించండని నచ్చజెప్పి పంపిందే అనుకుందాం, ...'నకిలీల' హవా నడుస్తున్న భూలోకం లో, తనని నమ్మరన్న సంశయంతో భగవంతుడు మధ్యలోనే వెను దిరిగి వెళ్ళిపోతేనో.. ?
కనుక ఈ లోపు మనమే యుద్ధం ప్రారంభిద్దాం. కనపడ్డ ప్రతి అవినీతి పరుని మీద మన అస్త్రాలని ప్రయోగిద్దాం.అన్యాయం జరిగిందని చదివి వదిలెయ్యకుండా, దాని చరిత్ర తెలుసుకుందాం. ౧౦ రూపాయల స్టంప్ ఖర్చుతో, సంబంధిత వివరాలను ఇంటికి తెప్పించుకుని పోరాటం సాగిద్దాం. పెద్ద పెద్ద విషయాల్లో తల దూర్చడం ఇష్టం లేదనుకుటే, మీ కోసమే వాడుకోండి. గ్యాస్ కనక్షన్స్ అనుకున్నట్టు రాకపోయినా, పాస్పోర్ట్ పనులకు, విద్యుత్ శాఖని నిలదీయుటకు ...ఇలా ప్రతి ప్రభుత్వ శాఖని ప్రశ్నించే అధికారం పొందండి.ఇది మన హక్కు..!!
ఇంతకీ దాని పేరేమిటో చెప్పలేదు కదూ.. "సమాచార హక్కు చట్టం".
మనకి దీనిని మించిన బలం లేదు .తలదన్నే ఆయుధం మరొకటి లేదు. ప్రతి పనికీ, ప్రతి కష్టానికి ఇది ఒక ఉపాయం చెప్తుంది, మనం కలలు కనే భారతాన్ని కళ్ళ ముందుకు తెస్తుంది.
ఇప్పటి దాకా ఏమేం సాధించామో ( ఒక చిన్న గ్రూప్ ద్వారా) తెలుసుకోవాలంటే, "లోక్ సత్తా సంజీవని" ని అడగండి.
http://www.loksattasanjeevani.blogspot.com/
ఇవి కేవలం సంకల్ప బలమే తప్ప మంది బలం లేని ఒక చిన్న గ్రూప్. కేవలం ఎలక్షన్స్ ముందు మనని ఊదర గొట్టి పారిపోయే రాజకీయ పార్టీల్లా కాక, ఒక లక్ష్యం తో ముందుకి వెళ్తున్న వారికి, ఒక్కసారి అభినందనలు తెలియజేద్దాం. కుదిరితే మన వంతు సాయం చేద్దాం.
అబ్బే, లేదండి ..మాది ఆమ్యామ్యా బండి, "ఇవ్వడం- తీసుకోవడం" మా ఆచారం ..ఆ గుంత లో నుండి బయటకు రాలేం అంటారా....ఎప్పుడు తెల్లారుతుందా..ఈ రోజు ఏ వార్తని ఖండిద్దామా...ఎవరిని నిందించి పక్కకి తప్పుకున్దామా ,అని ఆలోచిస్తూ..ఆనందంగా ఈ జన్మ కిలా కానీయండి.. :)
- మానస చామర్తి