Friday, February 25, 2011

" ఎ.పి.ఎస్.ఆర్.టి.సి " పై - స.హ చట్టం ఆధారంగా దరఖాస్తులు - ప్రతిస్పందనలు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక ప్రజానీకం ఉపయోగించే ప్రయాణ మాధ్యమం " ఎ.పి.ఎస్.ఆర్.టి.సీ  ". ప్రతి నిత్యం మనం సంస్థ పని తీరుని విమర్శించే వారినీ, తప్పని సరి పరిస్థితుల్లో, అసంతృప్తితో వారి సేవలను వాడుకునే వారినీ, చూస్తూనే ఉంటాము. అయితే, సంస్థ పని తీరును ప్రశ్నించే అవకాశం మనకే వస్తే ? మన సలహాలనూ, సూచనలనూ అందజేస్తూ, సవాళ్ళకు సరైన సమాధానం అందివమ్మని అడగగల హక్కులు మన చేతిలో ఉంటే?

 ఆర్.టి.ఐ (సమాచార హక్కు చట్టం) ఆధారంగా ఈ విషయంలో చేయబడిన కృషికి, " సత్య విశ్వేశ్వర రావు" గారు అందించిన అక్షర రూపం, మీ అందరి కోసం :

సమస్య ఏమిటి?

సంవత్సరాలుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లో పెరుగుతున్న సమస్యల కారణంగా ప్రయాణీకులకు వివిధ రకాలైన సమస్యలు ఎదురౌతున్నాయి. ఇందులో ప్రధానమైన సమస్యలు ఏమిటంటే, ప్రయాణ ప్రాంగణాలలో బస్సు రూట్ల గురించి, బస్సు వేళల గురించి సమాచారం లేకపోవడం, బస్సులకు కనీస ధారుడ్య ప్రమాణాలు
(ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ) లేకపోవడం, సంస్థ సిబ్బంది కి గుర్తింపు కార్డులు లేకపోవడం, బస్సులలో పరిశుభ్రత లేమి మొదలైనవి.


నిబంధనలు ఏమి చెప్తున్నాయి?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాష్ట్రం లోనే ప్రధానమైన రవాణా సంస్థ. ఇది రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలకు బస్సులను నడుపుతూ ప్రజలకు సేవ చేస్తున్నది. సంస్థ నడుపుతున్న సర్వీసుల్లో జిల్లా సర్వీసులు, నగర
సర్వీసులు ప్రధానమైనవి. ఇవి కాక అంతర్రాష్ట్ర సర్వీసులు, పల్లె ప్రాంతాల్లో సరకు రవాణ సర్వీసులు అదనం. ప్రతీ ప్రయాణికుడికి నిర్దేశిత ప్రమాణాల్లో నాణ్యత తో కూడిన సౌకర్యాలు కల్పించడం సంస్థ యొక్క ప్రధాన విధి.

చేపట్టిన చర్యలు  : 

తేది నవంబరు 11, 2009 రోజున మేము 30 ఫిర్యాదులు మరియు సూచనలతో కూడిన పత్రాన్ని సంస్థ వారికి సమర్పించి, వాటి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోమని కోరడం జరిగింది. సంస్థ యొక్క అంతర్గత సమస్యలను పరిష్కరించడం, ప్రయాణీకులకు నాణ్యత తో కూడిన సేవలను అందేటట్లు చూడటం దీని వెనుక ప్రధాన ఉద్దేశ్యం. కానీ ఈ ఫిర్యాదు ను సంస్థ వారు పట్టించుకోలేదు. అందువలన దీని పరిష్కారం దిశగా సమాచార హక్కు చట్టం ఉపయోగించుకుని 14 డిసెంబరు 2009 నాడు మేము ఒక దరఖాస్తును సంస్థ వారికి సమర్పించాము. అందులో అంతకు ముందు మేము సూచించిన సమస్యల పై సంస్థ తీసుకున్న చర్యల గురించి సమాచారం కోరడం జరిగింది. ఈ దిశగా సంస్థ లో వివిధ శాఖల మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలు, దస్త్రాలమీద అధికారులు రాసిన సూచనల సమాచారం కూడా కోరడం జరిగింది.

సంస్థ ప్రతిస్పందన :

మా స.హ. దరఖాస్తుకు స్పందిస్తూ, సంస్థ మాకు తేది 10 డిసెంబరు 2010 న సమాధానం పంపింది. దీనిలో సంస్థ తీసుకున్న చర్యలు, శాఖల మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలు, దస్త్రాలమీద అధికారులు రాసిన సూచనలు పొందుపరచటం జరిగింది. వారి సమాధానంలో పూర్తి సమాచారం లభించనప్పటికీ, కొన్ని సమస్యలకు వివరణ ఇవ్వటం, కొన్ని సమస్యలను పరిష్కరించటం జరిగింది. మేము సూచించిన సలహాలను ఆమోదిస్తునే, వాటి మీద తీసుకున్న చర్యలు గురించి తెలియజేయలేదు. కొన్ని తీవ్రమైన సమస్యల మీద సంస్థ తమని తాము సమర్ధించుకోజూసింది. బస్సుల కనీస ధారుడ్య ప్రమాణాలు (ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ) ఇందులో ముఖ్యమైనది. ప్రస్తుతం రహదారుల మీద తిరుగుతున్న చాలా బస్సులు ధారుడ్య ప్రమాణాలకు లోబడి లేనప్పటికీ, అన్ని బస్సులు నిర్దేశిత ప్రమాణాలలోనే ఉన్నాయని చెప్పడం జరిగింది.

ఇది మాకు పాక్షిక విజయమే కావచ్చు కానీ, క్రింది సమాచారం లేదా సంస్థ చర్యలు తీసుకునేలా చూడటంలో మేము కృతకృత్యులైనాము. 

* ప్రతి బస్సు కండక్టరు వద్ద ఫిర్యాదు పుస్తకం లభించేలా చూడటం.
* అన్ని బస్సు స్తాపుల్లోను, ప్రయాణ ప్రాంగణాలలోను బస్సు సమయ పట్టికలు, డిపో మేనేజరు మరియు సంబంధిత అధికారుల ఫోను నంబర్లు అందుబాటులో ఉంచడం
* బస్సుల పై గమ్యస్థాన వివరాలు తెలిపే బోర్డులు లేకపోవడం లేదా ప్రాంతీయ భాషలలో రాసి ఉండకపోవడం పై సంస్థ వారు విచారం వ్యక్తం చేసారు.
* ప్రధాన రహదారుల నుండి కొంచెం దూరం లో ఉన్న పల్లెలకు బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాడంపై వారి ప్రణాళికలను తెలియజేసారు.
* ప్రైవేటు వాహనాల తనిఖీకి రవాణా అధికారులు మరియు పోలీసులతో కలిసి పనిచెయ్యడానికి బృందాలను ఏర్పాటు చెయ్యడం.

ఇదే సమాచార హక్కు చట్టం యొక్క శక్తి. ఈ దరఖాస్తు చెయ్యకుండా ఉన్నట్టయితే సంస్థ లో ఈ సమస్యల పై ఎవరూ పని చేసేవారు కాదు కనీసం పట్టించుకునేవారు కాదు. సంజీవని ప్రజలందరినీ, సమస్యలపై స్పందించాలనీ, సమాధానాల కోసం సమాచార హక్కు చట్టాన్ని ఆసరాగా చేసుకోవాలనీ పిలుపునిస్తోంది.
రచనా సహకారం : సత్య విశ్వేశ్వర రావు. 

No comments:

Post a Comment