Sunday, December 19, 2010

సెక్షన్ 4(1)(బి) మీద సంజీవని యుద్ధభేరి!!


లోక్ సత్తా సంజీవని..!
అవినీతికీ అన్యాయానికి తావు లేని ఒక కొత్త లోకాన్ని సృష్టించేందుకు నడుం బిగించి ముందుకు వచ్చిన చైతన్య స్రవంతి సంజీవని! అవినీతి రక్కసి కోరల్లో చిక్కుకుని ఊపిరాడక ఆఖరి దశకు చేరుకోనున్న స్వతంత్ర భారతావనికి , ముప్పు తప్పించేందుకు ముందుకు వచ్చిన ఈ ' సంజీవని ' - లోక్ సత్తా అనుబంధ సంస్థ. ప్రజలే పెంచి పోషించిన బద్ధకానికీ, నిర్లక్ష్యానికీ అలవాటు పడి, పని చెయ్యడానికి పూర్తిగా నీళ్ళు వదిలిన కొన్ని ప్రభుత్వ కార్యాలయాల దుమ్ము దులిపేందుకు ముందడుగు వేసారీ సంజీవని సూత్రధారులు.


సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చి ఐదు వసంతాలు పూర్తి అయిన శుభ తరుణంలో, హక్కు మనకు అందించ దలచిన ఫలాలను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ఏదైనా వినూత్నంగా చెయ్యాలన్న లోక్ సత్తా సంజీవని సూత్రధారుల తలపుల్లో నుండి,తపనలో నుండి పుట్టినదే ఈ 'సెక్షన్ 4(1)(బి) పై యుద్ధభేరి ' ఘట్టం. అందులో భాగంగా, ఒకటో రెండో కాదు..పదులూ ఇరవైలూ కాదు..ఏకంగా 500 ఆర్.టి.ఐ  దరఖాస్తులు, ఒకే సెక్షన్ [ 4(1)(బి)] మీద పెట్టి, ఒక చరిత్రాత్మక మార్పుకు శ్రీకారం చుట్టారు సంజీవని సభ్యులు. ఈ దరఖాస్తులలో అధిక భాగం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ శాఖలు మరియు సచివాలయంలోని వివిధ విభాగాల ప్రథాన కార్యదర్శులకు, మిగిలినవి రంగారెడ్డి, నల్గొండ మరియు హైదరాబాదు జిల్లాల కార్యాలయాలకు ఉద్దేశింపబడినవి. దరఖాస్తులకు వచ్చిన సమాధానాలు స్వల్పంగాను, అసంతృప్తికరంగాను ఉండటంతో సంజీవని బృంద సభ్యులు 350 ఫిర్యాదులు దాఖలు చేసారు.

శాఖలు, కార్యాలయాలు పంపిన సమాధానాల గణాంకాలతో కూడిన వివరాలు క్రింద చూడగలరు. 


రాసిన వారు: మానస చామర్తి, సందీప్ పట్టెం. 

సెక్షన్ 4(1)(బి) ఏం చెపుతోందంటే :+

సమాచార హక్కు చట్టం చేసిన తేదీ నుండి 120 రోజుల లోపు, ప్రభుత్వ కార్యాలయాలు ఈ క్రింది అంశాలను ప్రకటించాలి:
సంస్థ నిర్మాణ స్వరూపం, విధులు, కర్తవ్యాల వివరాలు; దాని అధికారుల, ఉద్యోగుల అధికారాలు,విధులు; పర్యవేక్షణ,జవాబుదారితనంతో, సహ నిర్ణయాలు చేసే ప్రక్రియలో అనుసరించే కార్య విధానం; కార్యకలాపాలు నిర్వర్తించేందుకు రూపొందించినట్టి ప్రమాణాలు;కార్యకలాపాలు నిర్వర్తించేందుకు తమ ఉద్యోగులకు సంబంధించిన నియమాలు, నిబంధనలు, ఆదేశాలు లేదా తమ నియంత్రణ క్రింద ఉన్న లేదా తాము ఉపయోగించే నియమాలను వివరించే సంపుటిలు, రికార్డులు;తమ అధికారుల, ఉద్యోగుల డైరెక్టరి ; తమ అధికారులు, ఉద్యోగులలో ప్రతి ఒక్కరు తీసుకునే నెల వారీ ప్రతిఫలం, తమ నిబంధనలలో వీలు కల్పించిన విధంగా పరిహార విధానం; అన్ని ప్రణాళికలు, ప్రతిపాదిత వ్యయాలు, చేసిన పంపిణీలపై నివేదికల వివరాలను సూచిస్తూ తమ ఏజెన్సీలో ప్రతి ఒక్కరికి కేటాయించిన బడ్జెటు వివరాలు, తదితరాలు.

సంజీవని ఈ సెక్షన్‌నే ఎందుకు ఎంచుకున్నదంటే :

ఏ ప్రభుత్వమైనా సక్రమంగా పని చేయాలంటే, దానికి తప్పక తోడుండవలసినవి - జవాబుదారీతనం, పారదర్శకత, సమర్ధులైన అధికారులు. అయితే మొదటి రెండూ తప్పక అమలయ్యే సమాజంలో, సమర్ధులైన అధికారులు,
వాళ్ళంతట వాళ్ళే పుట్టుకొస్తారన్నది చరిత్ర నేర్పిన పాఠం. ఈ సెక్షన్ రూపకల్పనలో అంతర్లీనంగా దాగి ఉన్న రహస్యమూ,తద్వారా ఇది సమాజానికి చేయబోయే సాయమూ, ఇదే..!
ఈ సెక్షన్ అందుబాటులో ఉంచమని కోరినది, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి,  అతి ప్రాథమిక సమాచారం. ప్రతి కార్యాలయమూ ఈ వివరాలను ప్రకటించడం వలన, ప్రజలకు ఏ సమస్యకు ఎవరిని సంప్రదించాలో తేలిగ్గా అర్థం అవుతుంది. అనవసర ప్రయాసలూ, అక్కర్లేని ప్రయాణాలూ తగ్గుతాయి. పారదర్శకత పెరుగుతుంది. ఏ పనికి ఏ ప్రభుత్వ అధికారి బాధ్యుడో స్పష్టంగా తెలియడం వల్ల, తరచుగా జరిగే జాప్యాలకు సంబంధిత అధికారులను ప్రశ్నించేందుకు వీలు చిక్కుతుంది. తత్ఫలితంగా, జవాబుదారీతనం పెరిగి, అధికారులు మరింత సమర్థవంతంగా పని చేసేందుకు అవకాశాలు మెరుగు పడతాయి.
సంజీవని స్ఫూర్తి - సమాలోచనలు :

" -
ప్రజల యొక్క  - ప్రజల చేత - ప్రజల కొరకు - " అన్న సిద్ధాంతం ఇకపై కాగితాలకే పరిమితమా అన్న సందేహం బాధ్యతలెరిగిన కొందరు పౌరులను వేధిస్తున్న తరుణంలో, కొడిగడుతున్న ఆశా దీపాన్ని వెలిగించేందుకు , ప్రజాస్వామ్యపు సిసలైన స్ఫూర్తిని మిగిల్చేందుకు, రగిల్చేందుకు వచ్చినదే, " సమాచార హక్కు చట్టం ". ఈ చట్టం భారత దేశపు సగటు పౌరుడి చేతిలోని సుదర్శన చక్రం అని తెలుసుకోవడం తొలి అడుగయితే,దానిని సెక్షన్ 4(1)(బి) లాంటి ఒక ముఖ్యమయిన విభాగపు పని తీరు పర్యవేక్షణకై ఉపయోగించాలని సంజీవని నిర్ణయించుకోవడం మలి అడుగు.

ఆలోచనలు రేకెత్తినది మొదలు, బృంద నాయకుడిగా, అబ్దుల్ అజీజ్ నెల రోజులకు పైగా శ్రమించి దీనికి సంభందించిన వివరాలను సేకరించి, పకడ్బందీ ప్రణాళికను రూపొందించడం ఒక ఎత్తయితే, పది మందికి పైగా సభ్యులు, పిలవగానే 'నేను సైతం' అంటూ వచ్చి, వారి వారి పనులను నిర్ణీత సమయంలోనే పూర్తి చేసి, సంపూర్ణ సహాయ సహకారాలు అందించడం మరో ఎత్తు. ఎడతెరిపి లేకుండా సాగే ఆఫీసు పనుల మధ్యలోనూ, రాక రాక వచ్చే సెలవు రోజుల్లోనూ, విసుగూ విరామం లేకుండా, వంకలు చెప్పి తప్పించుకు పోకుండా, ఒక గురుతర బాధ్యతలా దీనిని స్వీకరించడంలో వారు చూపించిన స్ఫూర్తి అనితర సాధ్యం!

ఈ బృహత్కార్యాన్ని భుజాలకెత్తుకున్న బృంద సభ్యులు :

ఎలక్షన్ రెడ్డి, సంతోష్ కుమార్ గౌత, భరత్, అవనీష్ జోషి, ఉదయ్ భాస్కర్ , నరసింహ రావు, మధు, ప్రదీప్ దండు, శ్రీనివాస రావు గంజి , సావన్ , సుబ్రహ్మణ్యం, అభిలాష్ గార్లపాటి మరియు అబ్దుల్ అజీజ్.
అధికారుల స్పందన :

సమాచార హక్కు  చట్టం ప్రతీ ప్రభుత్వ కార్యాలయానికి ఒక ప్రభుత్వ సమాచార అధికారిని  నియమించింది. ప్రతీ అధికారికి సెక్షన్ 4(1)(బి)  తాలూకు సమాచారం  సమకూర్చే బాధ్యత వుంది. నియమాల ప్రకారం, ఈ సమాచారమంతా, అక్టోబర్ 12, 2005 నాటికే అందుబాటులో ఉండాలి.అలా ఉన్నట్లయితే, మన దరఖాస్తులకు, వెను వెంటనే జవాబులూ రావాలి. అయితే,ఈ కార్యక్రమానికి సంబంధించి సంజీవని అనుభవాలు మాత్రం నిరాశాజనకంగానే ఉన్నాయి.
స్థూలంగా చెప్పాలంటే, ఈ దరఖాస్తులకు వచ్చిన అధికారిక స్పందన, ప్రభుత్వ శాఖలు, కార్యాలయాల యందు  సమాచార హక్కు చట్టంలోని ఈ ముఖ్యమైన అంశాన్ని అమలు పరచటం పట్ల నెలకొన్న తీవ్రమైన  నిర్లక్ష్యానికి నిలువెత్తు దర్పణంగా నిలిచింది. సరైన, సంపూర్ణమైన సమాచారాన్ని అభ్యర్ధించిన విధంగా పంపడమే కాక, అంతర్జాలంలో కూడా అందుబాటులో ఉంచిన  కార్యాలయాల సంఖ్య అతి స్వల్పంగా ఉండడం దురదృష్టకరం. సమాచారాన్ని తెలుగులో సైతం  అందిస్తున్న వారి సంఖ్యా దీనికి భిన్నంగా లేదు. సంబంధిత అధికారులు కొందరు  సమాచారాన్ని పంపకపోగా, నియమాలకు  విరుద్ధంగా, సీడీలు , తపాలా చార్జీలు , తర్జుమా చార్జీల  నిమిత్తం  పది వేల రూపాయల వరకు అధికారికంగా జమ కట్టమనడం ఆశ్చర్యకరం. అసలీ సమాచారాన్ని అందిచ్చే అవసరమే లేదని తప్పించుకోజూసిన వారూ లేకపోలేదు."ప్రధాన కార్యాలయాలదే ముఖ్య సమాచార నిర్వహణ బాధ్యత " అని స్థానిక కార్యాలయాలూ, అన్ని ప్రాంతీయ కార్యాలయాల సమాచారాన్ని భద్రపరచడం మాకు సాధ్యం కాని పని అంటూ ప్రధాన కార్యాలయాలూ సంజీవని చేసిన అభ్యర్ధనలను తోసిరాజనడం తీవ్రమైన నిరాశకు గురి చేయడమే కాక ప్రాంతీయ-ప్రధాన కార్యాలయాల మధ్య నిర్వహణ రీత్యా పేరుకుపోయిన  అస్పష్టతను తేటతెల్లం చేసింది.
ఈ క్రింది పట్టికలు దరఖాస్తులు పెట్టిన కార్యాలయాలు వారి జవాబులకు సంబంధించిన  గణాంకాలను వివరిస్తున్నవి.

పట్టిక I: శాఖలు మరియు సచివాలయంలోని వివిధ విభాగాల ప్రథాన కార్యదర్శులకు పంపినవి



పట్టిక II: జిల్లా కార్యాలయాల ప్రథాన కార్యదర్శులకు పంపినవి
 


పట్టిక II: హైదరాబాదు జిల్లా స్థానిక కార్యాలయాలకు పంపినవి


సంజీవని ప్రతిస్పందన :

దరఖాస్తులకు వచ్చిన సమాధానాలు స్వల్పంగాను, అసంతృప్తికరంగాను ఉండటంతో సంజీవని బృంద సభ్యులు 350 ఫిర్యాదులు దాఖలు చేసారు. ఆర్.టి.ఐ సెక్షన్ 18(1) కింద (బి) తిరస్కరించబడిన, (సి) జవాబు రాని, (డి) డబ్బు జమా కోరిన మరియు (ఇ) అసంపూర్ణమైన సమాధానాలు వచ్చిన వాటిపై ఫిర్యాదులు  దాఖలు చేసారు. బృంద సభ్యులు సంబంధిత సమాచార అధికారుల వివరాలు, వారి చిరునామాలు, మరియు జవాబులకు సంబంధించిన గణాంకాల వివరాలన్నీ లిఖిత పూర్వకంగా ప్రకటిస్తున్నారు.

తక్షణ చర్యలు చేపట్టేనా ఇకనైనా:

లోక్ సత్తా సంజీవని, రాష్ట్ర ప్రభుత్వం మరియు సమాచార కమీషన్‌ను, సమాచార హక్కు చట్ట నిబంధనల అమలులో వేళ్ళూనుకుని ఉన్న నిర్లక్ష్య వైఖరిని ఖండించి, సంపూర్ణ ఆచరణకు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతోంది. ఈ సందర్భంగా, కేంద్రియ సమాచార కమీషన్‌ శాఖలు మరియు కార్యాలయాలు ఆర్.టి.ఐ కు కట్టుబడి,సెక్షన్ 4(1)(బి) ఆవశ్యకతను గుర్తించి,దాని సక్రమ అమలుకు చేసిన కృషి ప్రస్తావనార్హం, ప్రశంసనీయం. వారిని ఆదర్శంగా తీసుకుని,ఆంధ్ర ప్రదేశ్ సైతం ఈ హక్కు అమలుకై సంపూర్ణ సహకారాన్ని అందించిన నాడే, ప్రభుత్వ యంత్రాంగం పని తీరుపై ప్రజల్లో నెలకొన్న సందేహాలకు ఒక సమర్ధవంతమయిన సమాధానాన్ని ఆశించగలం.
సంజీవని పౌరులందరికి సమాచార హక్కు చట్టం అమలుకు తమ వంతు కృషి చెయ్యాలనీ,తద్వారా పరిణమించే బహువిధ ప్రయోజనాలను సాధించుకొనేందుకు సన్నద్ధులు కావాలనీ పిలుపునిస్తోంది. మరిన్ని వివరాలకు ( loksattasanjeevani@gmail.com ) కు ఈ-మెయిల్ చేయగలరు.

2 comments:

  1. Vazeer Chennupati, LS Krishna Dist..December 28, 2010 at 9:28 PM

    you are doing a great job. More branches and more volunteers will help your work easy. And further AP govt. offices will come into line. People will get benefited. Are the MLAs/MPs come under RTI? If so why thees people or left? These are the main culprits and against the society.

    ReplyDelete